Friday, May 4, 2012



అమరావతి

ప్రకృతి కప్పిన తెల్ల మంచుపరదాలోంచి
చిలిపిగాతొంగిచూస్తోంది గిరితరుణి!
ఆ లలన విసిరే కొంటె చూపుల్లోంచి తప్పించుకోలేక
మది మరీమరీ ఇబ్బంది పడుతోంది.
యదబరువుకు శృతి తప్పిన పమిటలా
శృంగారంగా ప్రవహిస్తోంది 'కృష్ణ' ఆ తరుణికి!
పడమట నున్న సూర్యుడు-
ప్రేమతోప్రియుడు దిద్దిన కుంకుమ బొట్టులా ఉన్నాడా అతివకి!
అతని సమయం ముగిసినట్లుందీరోజుకి-
పూర్వదిశకు పయనమయ్యాడు-ఇరుల రాదారిలో!!
పోతూపోతూ తన సంధ్యాకిరణజనిత
కాషాయవర్ణాన్ని ఆ పమిటలో ఇమిడ్చి పోయాడు.
ఎంతటి త్యాగం!
పులుముకున్న కొత్త రంగుతో
ఎగసిపడుతున్న హృదయ శ్వాసతో
పరుగులెడుతున్న పమిటప్రవాహాన్ని
చూస్తూ అలాగేనిల్చున్నాను.
అయినా పర్వాలేదు-తామసి నాకలవాటే!
ఇప్పుడామె మరింత అందంగా కన్పిస్తోంది
చిక్కటి చీకటి కురులతో!!
ఆ కురులలోంచి జాలువారిన ఒక విరించిని
చప్పున చేతుల్లోకి తీసుకున్నాను
సముద్ర పుష్పమది-నత్తగుల్ల.
ప్రకృతి విసిరిన ఈ సమ్మోహన గాలం నుంచి
తప్పించుకోవాలనిలేదు!
అక్కడేవుండేవాడినేమో- ఈ బంధాలు లేకపోతే!
ప్రవాహంమాత్రం అలాగే సాగిపోతోంది-నిశ్చలంగా-ఏ బంధాలూ లేకుండా!!
                                                   పొ.స.సు.పవన్  గణేష్
                                                   9247524379



Wednesday, May 2, 2012


ఒక్క ప్రశ్న..


నువ్వు నన్ను ప్రశ్నించడానికి వస్తున్నావని తెలిసి
చాలా ఆనందించాను.
నాదగ్గర వున్న గ్రంధాలన్నీ మళ్ళీ చదివాను-
నీకు అవకాశం లేకుండా!
నాగర్వం నాలో ఉత్సాహాన్ని నింపేసింది-
నిన్ను ఓడించేద్దామన్నంత!
ఆ క్షణంకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను-
రానే వచ్చింది.
ఎవరూ ఊహించని క్లిష్టమైన ప్రశ్నలు-
పెద్ద పెద్దవి వేస్తావనుకున్నాను.
కానీ-
నువ్వడిగిన ఆ 'చిన్న' ప్రశ్నకి
నాదగ్గర సమాధానంలేక వెతుక్కుంటుంటే,
చిరునవ్వుతో నన్ను చూస్తున్న నీ కళ్ళమెరుపులు తెలియజెప్పాయి నాకు-
నేనింకా అక్షరాలు సైతం నేర్చుకోలేదని!!
              - పొ.స.సు.పవన్ గణేష్
                9247524379