Wednesday, October 1, 2008

*** నేనూ- నువ్వూ ***

అనంత విశ్వం
అంతులు చూడడానికి - అమ్మ కడుపులో చేరిన
పరమాణువుల
నేనూ- నువ్వూ !
ఎవరికీ
అందలేనంత ఎదిగి - ఆడుకుంటున్న
విశ్వాలం
నేనూ- నువ్వూ !
లోకాన్ని
వెక్కిరించడానికి - విరుచుకు పడదామనుకునే
నిప్పులం
నేనూ- నువ్వూ !
కడలి కల్లోలం లో
దండ గుచ్చడానికి - ముత్యపు చిప్పలు ఏరుకునే
బడుగు జీవులం
నేనూ- నువ్వూ !
జీవితం
తూచడానికి- తక్కెడలో వేసే
తూనిక రాళ్ళం-
నేనూ- నువ్వూ !
కుంచె చేసిన
నృత్యంలో పుట్టిన
తెలుపూ- నలుపూ బొమ్మలం
నేనూ- నువ్వూ !
నిశ్శబ్దంగా
శబ్దాన్ని సృష్టించడానికి కలిసే
అరచేతులం
నేనూ- నువ్వూ !
స్వేచ్ఛ నుండి
స్వేచ్ఛలోనికి
పయనించాలనుకునే- విహంగ రెక్కలం
నేనూ- నువ్వూ !

Saturday, May 10, 2008

మౌనం...

శబ్దం
నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు
ఉద్భవిస్తూంటుంది మౌనం
ప్రళయ కాల రుద్రుడిలా!
*****
వాన చినుకునీ
గాలి తునకనీ
పలకరించాలి -
మౌనం తెలియాలంటే !
అవి మాట్లాడితే
ప్రళయమే!
*****
ఒక్కక్షణం మాటల్ని తడిమి చూసాను-
మౌనంతో తడిసి వున్నాయవి.
ఇంకా తడి ఆరలేదు-
భయం వేసింది-తడిసిన నా చేతుల్ని చూసి,
తడి నా హృదయానికి పాకుతుందేమోనని!
మౌనానికి కొంచెం జాలి
వదిలేసిందప్పటికి!
మరి
చల్లదనం?
చిరుగాలి?
మాయమయ్యాయి- మౌనంతో పాటు!
ఎంతటి తాపత్రయం
ఈ మౌనానికి-
విశ్వాన్నేలేద్దామనుకుంటో౦ది !
నేనోక్కడిని ఉన్నానని
మరచిపోయినట్లుంది-
శబ్దాన్ని
పునర్జీవిని చెయ్యడానికి!
*****************మౌనం మాటగా మారడానికి సమాయత్తమౌతోంది**

Tuesday, May 6, 2008

మౌనం

మౌనం-
కొన్ని మాటలకి పునాది.
మరి కొన్నిటికి సమాధి!

తనంత తానుగా
వెళ్ళిపోతుంటుంది మౌనం-
మాటల మధ్యలోకి
మాట్లాడకుండానే !
*****
రివ్వున పోయి
చిరుగాలిని స్పృశించి వెనక్కి వచ్చింది మౌనం -
చాలా చల్లగా వుంది.
హాయిగా ఉంది.
వినోదం-
విషాదం -
రెండు రెక్కలనుకుంటా మౌనానికి-
ఎందులోనైనా అదే శూన్యం
******
భూమిలో దాక్కునే విత్తుకి తెలియదు
తానొక సమిధనౌతానని!
విశ్వాన్నేలే వృక్షానికి
ఊపిరి పోస్తోందని!
అందుకే మౌనం గా చూస్తుంటుంది.
లేకుంటే ఎలుగెత్తి
అరిచేది
బయట పడేయ్యమని-
నిర్జీవమైపోయేది
మౌనం లాగే !
**************** మౌనం మరల కొనసాగుతుంది**

Friday, May 2, 2008

మౌనం........

మాట్లాడ్డానికి మాటలు లేవు-
మౌనం తప్ప!
మాట-మాటకీ మధ్య మౌనమది.
రెండు శబ్దాల మధ్య దూరమది!

తెల్లకాగితం పై నల్లని అక్షరాలు-
రెండు అక్షరాల మధ్య శూన్యం-
శూన్యం మౌనం!

హృదయం మాట్లాడుతోనే వుంటుంది-
ఖండాలు దాటి విన్పించేలాగు!
భాష చెవులకి అర్ధం కాదు.
కళ్ళకి తప్ప!

చూసే మనస్సు- స్పందించే హృదయం
విడమరచి చెప్పలేనివి.
భావం తెలియదు కాబట్టి
పాపం!
******
మౌనం-
ఊపిరి పోస్తుంటుంది మాటలకి!
మాటలు నేర్పిస్తుంది-
నడిపిస్తుంది-
నవ్విస్తుంది-
కవ్విస్తుంది-

మాటలు
పాటలవుతాయి-
పరుగులెత్తే రాగాలవుతాయి-
వురకలు వేసే
జలపాతాలవుతాయి.

రాజ్యాన్నేలుతూనే వుంటుంది మౌనం-
మాటల యుద్ధం కొనసాగుతున్నంతసేపూ .
పిచ్చివి -
మాటలు
మౌనాన్ని జయిస్తున్నమనుకుంటాయి!
**** మౌనం ఇంకా మాటగా మారలేదు.

Tuesday, April 29, 2008

నా కవిత...

ఇది నా కవిత. కేవలం నాదే .నా హృదయ అంతరాళాలలో నుంచి వివిధ సందర్భాలలో వచ్చినవి. కొంతవరకు శ్రీశ్రీ గారి ప్రభావం వుండచ్చు.