Wednesday, April 25, 2012


రెండు చినుకుల మద్య....

విరిగి పడుతున్న మెరుపు ముక్కల్ని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ
చొక్కా జేబులో వేసుకుంటున్నాను.
చిక్కగా పరుచుకున్న చీకటి కంబళిపై
తళతళా మెరుస్తున్నాయవి.
రెండు గుప్పిళ్ళూ సరిపోనంత పెద్దవి.
తేరిపార చూసాను వాటిని-
అవి....
'ఆమె' వదలి వెళ్ళిన అనుభవాల ముక్కలు-
జ్ఞాపకాల ’బిందు’వులు.
విసురుగా పడుతున్న వర్షపు చినుకుల్లో
రెండు చినుకుల మద్యగా నడుస్తున్నాను-
వర్షంలో తడవకుండా!
కానీ....
అప్పటికే తడిసిపోయాను-
'ఆమె'  జ్ఞాపకాల తుఫానులో!!
- పొ. స .సు .పవన్ గణేష్.
                             ఆం.ప్ర- 9247524379

Saturday, February 20, 2010

చిన్న విన్నపం..

ఒక్క క్షణాన్ని వెనక్కి నడపరాదూ..
లిప్తపాటు కాలగమనాన్ని ఆపరాదూ..
హరా-
ఏం హరించివేశావయ్యా నువ్వు?
భయమా? బంధమా?
కాలమా? ప్రాణమా?

నీ ఆజ్ఞ -
సంసార సాగరాన్ని దాటించి ఒడ్డున పడేసిందా మృత్యువు?
లేక
నీకు తెలియకుండా వికటాట్టహాసం చేసిందా అపమృత్యువు?
నీకు తెలియకుండానా-
వెర్రి వాడిని!
నీ విలయతాండవం చూస్తుంటే భయం వేస్తోంది నాకు!
ఒక్కొక్కరుగా -ఒక్కమాటుగా..
వందలాదిగా- వేలాదిగా!
పగలూ- రేయీ !
మంచీ- చెడూ!
ధర్మం- అధర్మం!
చావూ- పుట్టుకా!
జోడుగుర్రాలు లాగే కాల రధంపై ఎక్కి-
నువ్వు మాత్రం చూస్తూ కూర్చుంటావు!
నవ్వుకుంటూ సాగిపోతుంటావు!

నీ రధ చక్రం క్రింద నలిగి గాయపడిన జీవాల రోదన
వినిపించట్లేదా నీకు?
అబద్ధం!
నటిస్తున్నావు!
కర్మఫలాన్ని సాకుగా చూపి-
చిద్విలాసం చిందిస్తున్నావు!
అవునులే-
అపమృత్యువు- అకాల మృత్యువు;
విధి - వైపరీత్యము;
నీ రధ చక్రాలేగా- నువ్వెలా సరిచేస్తావు వాటిని?
అందుకే-
ఒక్క క్షణాన్ని వెనక్కి నడపరాదూ..
లిప్తపాటు కాలగమనాన్ని ఆపరాదూ..
కేవలం వారి ఆత్మ శాంతికై-
నా యీ చిన్న విన్నపం!
(పరమ శివుని సన్నిధికి చేరిన నా మిత్రునికి )
- భరత్ నీ ఆత్మకు శాంతి కలగాలని శివుడిని ప్రార్ధిస్తూ..
పొ. స.సు. పవన్ గణేష్.
21-02-2010
02:16 AM

Tuesday, January 12, 2010

సంక్రాంతి

బుజ్జాయిలకు భోగి పళ్ళు
ముగ్గులతో అలరారే వాకిళ్ళు
గంగిరెద్దుల సందళ్ళు
గొబ్బెమ్మల ముంగిళ్ళు

అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు
తాతమ్మ చేసిన బెల్లం జీళ్ళు
బావల్ని ఆటపట్టించే మరదళ్ళు
పట్టు ఓణీలతో గిలిగింతలు పెట్టే వాలు కళ్ళు

కమ్మని నేతి అరిసెలు
ఘుమ్మనే పూర్ణం బూరెలు
అక్షయ పాత్రల హరిదాసులు
పసుపు బొట్టు పెట్టిన కొత్త బట్టలు

వెచ్చని భోగి మంటలు
ఆల మందల అలంకరణలు
కొత్త బియ్యం చక్కిలాలు
గారెల ఘుమఘుమలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో ..

మన అచ్చ తెనుగు సంక్రాంతి సంబరాలు.
మరువలేని మధురానుభూతులు.
- పవన్ గణేష్
హైదరాబాదు

12-01-2010

Monday, December 28, 2009

శవాలు

చిన్న చిన్న ఆలోచనలు మీగడతరకల్లా తేలుతుంటే
గోదారి ఒడ్డున సన్నజాజి పందిరి క్రింద
పండువెన్నెల్లో నిల్చున్నాను-
అలోచిస్తో!
గోదారి అలలు నిశ్శబ్దంగా
నిమిషాలు లెక్కపెడ్తూ సాగిపోతున్నాయి-
నన్ను చూస్తూ.
కెరటాల్లో కదలిపోతున్న ప్రతి బిందువూ
స్వచ్చమైనదే-
' హిమబిందు ' వంత !
జోరుగా వీస్తున్న గాలివాటుకి
ఎటో ఎగిరి పోయింది -
నా కల్లోల హృదయం.
వెతుక్కుంటూ బయల్దేరాను.
ఆలోచనలు మాత్రం కదల లేదు.
బిక్క చచ్చిన శవాల్లా అక్కడే పడున్నాయి.
పురాతన త్రవ్వకాలలో దొరికేవన్నీ ఎప్పటికీ శిధిలాలే-
నిజాలు కావు!
కాళ్ళకి తగులుతున్న ఇసక కళ్ళకి కన్పింకుండానే
ఇబ్బంది పెడుతోంది అడ్డంపడుతూ!
వంగి ముచ్చటగా మందలించాను- కానీ వినలేదు.
బహుశః ఇది కూడా నా ఆలోచనల్లాంటిదేమో!
అరమైలు క్రితం వదిలి వచ్చానా కుక్కపిల్లని -
అయినా వెతుక్కుంటూ వచ్చి
ఇంటి గుమ్మం ముందు చెవులు వాల్చి నిలబడింది-
లిబర్టీ లా !
కళ్ళు మూసాను ఒక్కక్షణం. చిమ్మ చీకటి.
భయంతో కళ్ళు తెరిచాను- ఇక్కడా చీకటే !
కానీ ఒక్కటే మెరుస్తూ కన్పిస్తోంది!
హృదయం!
దూరంగా!
పరిగెత్తి పోయాను దాని దగ్గరికి.
చక్కని ప్రదేశం- చాలా అనువైనది 'దాని' కోసం!
'గోదారి' కూడా ఆగి వేచిచూస్తోంది.
నా దగ్గరున్న బిక్కచచ్చిన 'శవాల్ని' పాతి పెట్టేందుకు
నేను తీస్తున్న గోతిలో గుప్పెడు మట్టి పొయ్యడానికి!
***
- ౧౯ -౦౭- ౨౦౦౫
హైదరాబాదు

Friday, December 11, 2009

నిజం...

ప్రపంచం ఒదిగే వుంటుంది-
ఎందుకో అర్ధం కాదు.
విశ్రుంఖల బంధాల్ని తెంచుకుని
బయటపడితే బాగుండుననిపిస్తుంది!
విచ్చుకత్తుల పహారాలో బ్రతుకుతున్నట్లు-
ఇనుప సంకెళ్ళలో ఇంకెన్నాళ్ళు?
విత్తుని చీల్చుకుని బయల్పడే
మహా వృక్షం లాగ-
మేఘాల్ని విదుల్చుకుని రాలే
తుఫాను చినుకు లాగ-
రాతి పరదాల మాటున దాగిన
బంధాల్ని బయటకు లాగి
విసిరేయాలనిపిస్తోంది.
ఎన్నో రాత్రులు గతించాయి-
హృదయ స్మశానంలో గూళ్ళు కట్టుకున్న
నైరాశ్యపు గబ్బిలాల్ని తరమలేదు.
ఏమిటో బంధం?
భూమ్యాకాశాల లాగు .
వింటున్నావా నేస్తం -
మనస్సు ఘోష
నిన్నువదలి ఎటో వెళ్ళిపొమ్మని.
పాపం దానికేం తెలుసు హృదయ మధనం!
విశ్వాసం లేనిదది.
దొర్లుతున్న గులక రాళ్ళకింద నలుగుతున్న
జీవాల రోదన.
నవ్వొస్తోందా- నను చూస్తుంటే -
విశాల విశ్వంలో నేనొక్కడినే అయినట్లు-
మరొక్క మాట-
మళ్లీ అదే నైరాశ్యం- ఎందుకో అర్ధం కాని తత్త్వం.
కాని ఇది నిజం-
ఎప్పటికీ-
ప్రపంచం-
ఒదిగే వుంటుంది!

Monday, May 4, 2009

టాంక్ బండ్......

అచ్చ మైన ముద్ద బంతి లాంటి తెలుగు పడుచు
సంక్రాంతి రంగులతో ముగ్గులేయడానికి కూర్చుతున్న
చుక్కల్లా వున్నాయి దీపాలు- టాంక్ బండ్ చుట్టూ
ఒద్దికగా .
అక్కడ బెంచ్ పై నేను , నా ప్రక్కన ఆకాశం.
పైన కూడా ఆకాశమే!
ఒక్కొక్క జంటా నా వెనుక నుంచి నడచి వెళ్లి తమ
స్థానాల్ని వెతుక్కుంటున్నాయి.
చుట్టూ చేమంతి రేకలతో , మరువం చిగుళ్ళతో
పరిచిన నీటి ముగ్గుకి మద్యలో గొబ్బెమ్మలా ఉన్న
బుద్ధుడే సాక్షి - జంటలన్నిటికి.
నీటిని చీల్చుకుంటూ దూసుకెళ్తున్న మరపడవలో
జంట ఎంత సంతోషంగా వుందో - పడవ వదిలి వెళ్ళిన
అలల్ని చూస్తే తెలిసింది.
రెహ్మాన్ విరుపో లేక ప్రయాణికుల అరుపో
హుస్సేన్ సాగర్ లో పోతున్న దీపాల పడవ నుంచి విన్పిస్తోంది.
దానికి తగినట్టు మరుమల్లెల నృత్యం అందులో!
అది కన్పిస్తోంది లీలగా!
మినుకు మినుకు మంటూ దూరంగా వెలిగింది- మిణుగురు పురుగులా-
అంతకంతకు దగ్గరై యు టర్న్ తీసుకుని బేగంపేటలో దిగిపోయిందా విమానం-
నా తలపై నుంచి!
వరుసగా కన్పిస్తున్న బిర్లా మందిర్, సచివాలయం, మాక్స్ లైట్లు
నగరాన్ని తామే పాలిస్తున్నట్లు ఠీవిగా నిలబడ్డాయి!
వెనుక ప్రపంచాన్ని చీల్చుకుని గమ్యాలకి పరుగులు పెట్టే
బస్సులు, ఆటోలు, సైకిళ్ళు - ఆలస్యానికి చింతిస్తున్నట్లున్నాయి ఎక్కడా
ఆగడం లేదు!
తలపైకెత్తి చూస్తే ఒక్క చుక్కా లేదు- నక్షత్రాలన్నిటిని ఒక పరదా కప్పేసింది.
మనుషుల ఆశల్లోంచి పుట్టిన వాహనాల శ్వాస నిట్టూర్పులు- వెచ్చని
సెగలై ఈచుక్కల్ని కన్పించకుండా చేసేసాయి.
పాపం- చంద్రుడు గట్టివాడు. అందుకే పున్నమి రాత్రయినా
మసక మసగ్గా కన్పించాడా పొగలో.
భవిష్యత్తులో చూడగలనో లేదో అని తనివితీరా చంద్రుడిని
అలాగే చూస్తూ కూర్చున్నాను-
తలపైకెత్తి.

Wednesday, October 1, 2008

*** నేనూ- నువ్వూ ***

అనంత విశ్వం
అంతులు చూడడానికి - అమ్మ కడుపులో చేరిన
పరమాణువుల
నేనూ- నువ్వూ !
ఎవరికీ
అందలేనంత ఎదిగి - ఆడుకుంటున్న
విశ్వాలం
నేనూ- నువ్వూ !
లోకాన్ని
వెక్కిరించడానికి - విరుచుకు పడదామనుకునే
నిప్పులం
నేనూ- నువ్వూ !
కడలి కల్లోలం లో
దండ గుచ్చడానికి - ముత్యపు చిప్పలు ఏరుకునే
బడుగు జీవులం
నేనూ- నువ్వూ !
జీవితం
తూచడానికి- తక్కెడలో వేసే
తూనిక రాళ్ళం-
నేనూ- నువ్వూ !
కుంచె చేసిన
నృత్యంలో పుట్టిన
తెలుపూ- నలుపూ బొమ్మలం
నేనూ- నువ్వూ !
నిశ్శబ్దంగా
శబ్దాన్ని సృష్టించడానికి కలిసే
అరచేతులం
నేనూ- నువ్వూ !
స్వేచ్ఛ నుండి
స్వేచ్ఛలోనికి
పయనించాలనుకునే- విహంగ రెక్కలం
నేనూ- నువ్వూ !