Friday, August 10, 2012


                         ఒలంపిక్స్ పతకాలు..
                         వస్తాయ్ మనకీ!

సిటీ బస్సు వెనకాలగ
ఆగకుండ పరుగుపెట్టి
ఫుట్ బోర్డు కు వ్రేలాడే
సిటీజీవి పరుగెడితే
వస్తాయ్ మనకీ పరుగుల పతకాలొస్తాయ్!

                                         మోయలేని బరువులన్ని
                                         వంగివంగి మోస్తున్న
                                         ఎల్కేజీ పిల్లలపంపిస్తే
                                         వస్తాయ్ మనకీ బరువుల పతకాలొస్తాయ్!

ఒక్క చినుకు రాలిపడగ
మడుగులైన వీధులలో
నిత్యం నడిచే
బడుగుజీవినంపిస్తే
వస్తాయ్ మనకీ ఈతల పతకాలొస్తాయ్!

                                         సెకనుకొక్క రేటుమారి
                                         రాకెట్ లా పోయే
                                         ఆ ధరల పెంచు బడాబాబు లెగిరితే
                                         వస్తాయ్ మనకీ హైజంపుల పతకాలొస్తాయ్!

పూటకో పార్టీలో
పార్టీకో రేటుతో
మాటమార్చి రూటుమార్చు
మన నేతల జిమ్నాస్టుల పంపితే
వస్తాయ్ మనకీ పతకాలొస్తాయ్!

రాలేదని దిగులెందుకు?
వస్తాయ్ మనకీ బంగార్ పతకాలొస్తాయ్!
(2008 బీజింగ్ ఒలంపిక్స్ కి వ్రాసినది. ఇప్పటికే కాదు- ఎప్పటికీ మార్చనవసరం లేదు)
                                           - పొ.స.సు.పవన్ గణేష్.
                                              10-08-2012

Friday, May 4, 2012



అమరావతి

ప్రకృతి కప్పిన తెల్ల మంచుపరదాలోంచి
చిలిపిగాతొంగిచూస్తోంది గిరితరుణి!
ఆ లలన విసిరే కొంటె చూపుల్లోంచి తప్పించుకోలేక
మది మరీమరీ ఇబ్బంది పడుతోంది.
యదబరువుకు శృతి తప్పిన పమిటలా
శృంగారంగా ప్రవహిస్తోంది 'కృష్ణ' ఆ తరుణికి!
పడమట నున్న సూర్యుడు-
ప్రేమతోప్రియుడు దిద్దిన కుంకుమ బొట్టులా ఉన్నాడా అతివకి!
అతని సమయం ముగిసినట్లుందీరోజుకి-
పూర్వదిశకు పయనమయ్యాడు-ఇరుల రాదారిలో!!
పోతూపోతూ తన సంధ్యాకిరణజనిత
కాషాయవర్ణాన్ని ఆ పమిటలో ఇమిడ్చి పోయాడు.
ఎంతటి త్యాగం!
పులుముకున్న కొత్త రంగుతో
ఎగసిపడుతున్న హృదయ శ్వాసతో
పరుగులెడుతున్న పమిటప్రవాహాన్ని
చూస్తూ అలాగేనిల్చున్నాను.
అయినా పర్వాలేదు-తామసి నాకలవాటే!
ఇప్పుడామె మరింత అందంగా కన్పిస్తోంది
చిక్కటి చీకటి కురులతో!!
ఆ కురులలోంచి జాలువారిన ఒక విరించిని
చప్పున చేతుల్లోకి తీసుకున్నాను
సముద్ర పుష్పమది-నత్తగుల్ల.
ప్రకృతి విసిరిన ఈ సమ్మోహన గాలం నుంచి
తప్పించుకోవాలనిలేదు!
అక్కడేవుండేవాడినేమో- ఈ బంధాలు లేకపోతే!
ప్రవాహంమాత్రం అలాగే సాగిపోతోంది-నిశ్చలంగా-ఏ బంధాలూ లేకుండా!!
                                                   పొ.స.సు.పవన్  గణేష్
                                                   9247524379



Wednesday, May 2, 2012


ఒక్క ప్రశ్న..


నువ్వు నన్ను ప్రశ్నించడానికి వస్తున్నావని తెలిసి
చాలా ఆనందించాను.
నాదగ్గర వున్న గ్రంధాలన్నీ మళ్ళీ చదివాను-
నీకు అవకాశం లేకుండా!
నాగర్వం నాలో ఉత్సాహాన్ని నింపేసింది-
నిన్ను ఓడించేద్దామన్నంత!
ఆ క్షణంకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను-
రానే వచ్చింది.
ఎవరూ ఊహించని క్లిష్టమైన ప్రశ్నలు-
పెద్ద పెద్దవి వేస్తావనుకున్నాను.
కానీ-
నువ్వడిగిన ఆ 'చిన్న' ప్రశ్నకి
నాదగ్గర సమాధానంలేక వెతుక్కుంటుంటే,
చిరునవ్వుతో నన్ను చూస్తున్న నీ కళ్ళమెరుపులు తెలియజెప్పాయి నాకు-
నేనింకా అక్షరాలు సైతం నేర్చుకోలేదని!!
              - పొ.స.సు.పవన్ గణేష్
                9247524379

Thursday, April 26, 2012

ఓ ప్రియురాలా!


ప్రపంచంలో అంతులేని సంతోషాన్ని చూపించవూ-

అడిగాడొక పిచ్చివాడు!

చల్లని వెన్నెలలో విరిసిన మల్లెలాంటి నగుమోముతో

నువ్వు నాతో మాట్లాడుతున్న క్షణాల్ని చూపించాను-

పగలబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు!!


ఈ అంతులేని లోకాల్లో ఎవరూ కనని అనంత విరహాన్ని 

చూపమంటున్నాడదే వెర్రివాడు!

సూర్యుని వెచ్చని కౌగిలిలో పులకించిన పుడమి,

సంధ్యాకాలపు విరహాన్ని అనుభవిస్తోంది!

అవి- నేను నిన్ను విడిచి వచ్చిన క్షణాలు!

చూపాను వాడికి-

వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయాడు- ఇక వెనక్కి చూడకుండా!!
                                         పొ. స.సు.పవన్ గణేష్                                         ఆం.ప్ర-9247524379

Wednesday, April 25, 2012


రెండు చినుకుల మద్య....

విరిగి పడుతున్న మెరుపు ముక్కల్ని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ
చొక్కా జేబులో వేసుకుంటున్నాను.
చిక్కగా పరుచుకున్న చీకటి కంబళిపై
తళతళా మెరుస్తున్నాయవి.
రెండు గుప్పిళ్ళూ సరిపోనంత పెద్దవి.
తేరిపార చూసాను వాటిని-
అవి....
'ఆమె' వదలి వెళ్ళిన అనుభవాల ముక్కలు-
జ్ఞాపకాల ’బిందు’వులు.
విసురుగా పడుతున్న వర్షపు చినుకుల్లో
రెండు చినుకుల మద్యగా నడుస్తున్నాను-
వర్షంలో తడవకుండా!
కానీ....
అప్పటికే తడిసిపోయాను-
'ఆమె'  జ్ఞాపకాల తుఫానులో!!
- పొ. స .సు .పవన్ గణేష్.
                             ఆం.ప్ర- 9247524379

Saturday, February 20, 2010

చిన్న విన్నపం..

ఒక్క క్షణాన్ని వెనక్కి నడపరాదూ..
లిప్తపాటు కాలగమనాన్ని ఆపరాదూ..
హరా-
ఏం హరించివేశావయ్యా నువ్వు?
భయమా? బంధమా?
కాలమా? ప్రాణమా?

నీ ఆజ్ఞ -
సంసార సాగరాన్ని దాటించి ఒడ్డున పడేసిందా మృత్యువు?
లేక
నీకు తెలియకుండా వికటాట్టహాసం చేసిందా అపమృత్యువు?
నీకు తెలియకుండానా-
వెర్రి వాడిని!
నీ విలయతాండవం చూస్తుంటే భయం వేస్తోంది నాకు!
ఒక్కొక్కరుగా -ఒక్కమాటుగా..
వందలాదిగా- వేలాదిగా!
పగలూ- రేయీ !
మంచీ- చెడూ!
ధర్మం- అధర్మం!
చావూ- పుట్టుకా!
జోడుగుర్రాలు లాగే కాల రధంపై ఎక్కి-
నువ్వు మాత్రం చూస్తూ కూర్చుంటావు!
నవ్వుకుంటూ సాగిపోతుంటావు!

నీ రధ చక్రం క్రింద నలిగి గాయపడిన జీవాల రోదన
వినిపించట్లేదా నీకు?
అబద్ధం!
నటిస్తున్నావు!
కర్మఫలాన్ని సాకుగా చూపి-
చిద్విలాసం చిందిస్తున్నావు!
అవునులే-
అపమృత్యువు- అకాల మృత్యువు;
విధి - వైపరీత్యము;
నీ రధ చక్రాలేగా- నువ్వెలా సరిచేస్తావు వాటిని?
అందుకే-
ఒక్క క్షణాన్ని వెనక్కి నడపరాదూ..
లిప్తపాటు కాలగమనాన్ని ఆపరాదూ..
కేవలం వారి ఆత్మ శాంతికై-
నా యీ చిన్న విన్నపం!
(పరమ శివుని సన్నిధికి చేరిన నా మిత్రునికి )
- భరత్ నీ ఆత్మకు శాంతి కలగాలని శివుడిని ప్రార్ధిస్తూ..
పొ. స.సు. పవన్ గణేష్.
21-02-2010
02:16 AM

Tuesday, January 12, 2010

సంక్రాంతి

బుజ్జాయిలకు భోగి పళ్ళు
ముగ్గులతో అలరారే వాకిళ్ళు
గంగిరెద్దుల సందళ్ళు
గొబ్బెమ్మల ముంగిళ్ళు

అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు
తాతమ్మ చేసిన బెల్లం జీళ్ళు
బావల్ని ఆటపట్టించే మరదళ్ళు
పట్టు ఓణీలతో గిలిగింతలు పెట్టే వాలు కళ్ళు

కమ్మని నేతి అరిసెలు
ఘుమ్మనే పూర్ణం బూరెలు
అక్షయ పాత్రల హరిదాసులు
పసుపు బొట్టు పెట్టిన కొత్త బట్టలు

వెచ్చని భోగి మంటలు
ఆల మందల అలంకరణలు
కొత్త బియ్యం చక్కిలాలు
గారెల ఘుమఘుమలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో ..

మన అచ్చ తెనుగు సంక్రాంతి సంబరాలు.
మరువలేని మధురానుభూతులు.
- పవన్ గణేష్
హైదరాబాదు

12-01-2010